కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి!

  • ఎకరం భూమి పంపకాల వివాదమే హత్యలకు కారణం
  • ఆటో డ్రైవర్ అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు
  • నిందితుడి తండ్రి అదృశ్యం కేసును కూడా తిరగదోడుతున్న అధికారులు
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లి, సోద‌రుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ జంట హత్యల కేసులో నిందితుడైన సజీ (45)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలే ఈ ఘోరానికి దారితీశాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
పొన్నూట్టిల్ కుటుంబానికి చెందిన సజీ, అతని సోదరుడు రెజీ (40), తల్లి మేరీకుట్టి (65)తో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబానికి చెందిన సుమారు ఎకరం భూమిని పంచుకోవడంపై సోదరుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఒకరోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రెజీతో సజీకి వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో రెజీ ముఖంపై సజీ తీవ్రంగా దాడి చేశాడు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను చూసిన కన్నతల్లి మేరీకుట్టిని కూడా ముఖంపై కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

రెండు రోజుల పాటు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి, ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. ఈ హత్యలు చేయడంలో తనకు ఎవరూ సహాయం చేయలేదని, ఒక్కడినే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని సజీ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం.

ఆటో డ్రైవర్ అనుమానంతో వెలుగులోకి...
దాదాపు నెల రోజుల నుంచి మేరీకుట్టి, రెజీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి సజీ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అయితే, అనారోగ్యంతో ఉండే మేరీకుట్టిని తరచూ ఆసుపత్రికి తీసుకువెళ్లే ఓ ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. రెజీ చేసే పనులను సజీ చేస్తుండటంతో అతనికి అనుమానం బలపడింది. ఈ విషయాన్ని అతను అనక్కరలో నివసిస్తున్న వారి సోదరి సినికి తెలియజేశాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

పోలీసులు సోమవారం సజీ ఇంటికి చేరుకోగా, వారిని చూసి అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం బలపడిన పోలీసులు ఇంటి ఆవరణలో తవ్వకాలు జరపగా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిందితుడు సజీని మంగళవారం అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కాగా, 2018లో వీరి తండ్రి మాథ్యూ కూడా అదృశ్యమయ్యాడు. ఆ ఘటనతో ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kerala
Murder
Crime News
Kerala Police

More Telugu News